సీఎం చంద్రబాబుతో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ
నూతన ఆవిష్కరణలకు, సాంకేతికతకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్‌ను కోరారు. మరింత పారదర్శక పాలన కోసం గూగుల్ సహాయం పెద్ద ఎత్తున తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని సచివాయలంలో తనని కలిసిన ఆనందన్‌తో చెప్పారు. దీంతో అత్యవసర సేవలు వేగవంతంగా అందించేందుకు తాము కొత్తగా అభివృద్ధి చేసిన ప్లస్‌కోడ్ అనే నూతన విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలకు ఈ విధానాన్ని అనుసంధానించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ సందర్భంగా పాలన, భద్రతా చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న సాంకేతికతను ముఖ్యమంత్రి గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌కు వివరించారు. అమరావతిని సిలికాన్ వ్యాలీ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో అత్యధిక తలసరి ఆదాయం తెలుగు వారిదేననే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో 33 శాఖలకు త్వరలో యూట్యూబ్ ఛానల్స్ తీసుకొస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ నేపథ్యంలో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది.













