ప్రతి నీటి బొట్టునూ కాపాడుకోవాలి : సీఎం జగన్
సీజన్లో పడే ప్రతి వాన చుక్కనూ ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకున్నప్పుడే కరవును ఎదుర్కోగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విశాఖలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధిక వర్షపాతమున్న ప్రాంతాల నుంచి కరవు కోరల్లో చిక్కిన భూములకు నీటిని మళ్లించే ప్రణాళిక అవసరమని తెలిపారు. నీటి సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచించాలని కోరారు. రాష్ట్రం జల వనరుల పరంగా మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు. వ్యవసాయానికి నీటికొరత ప్రధాన సమస్యగా ఉందని తెలిపారు. దీనికి మైక్రో ఇరిగేషన్ ఒక సమాధానంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వర్షాలు కురిసే సమయం బాగా తగ్గిపోయిందని ప్రతి నీటి బొట్టునూ కాపాడుకోవాలన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 90 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.













