‘జగనన్న వసతి దీవెన’ నిధులను విడుదల చేసిన సీఎం జగన్

ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, అందుకే తాము విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని స్పష్టం చేశారు. ‘‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ సొమ్మును జమ చేశారు. ఇందుకు గాను 1,048.94 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దాదాపు 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తొలి విడత నగదు జమ చేశారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో ‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ చేస్తామన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం వస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం వల్లే విద్యా రంగంలో డ్రాప్ అవుట్లు తగ్గాయని ప్రకటించారు. వచ్చే ఏడాది అమ్మఒడి పథకానికి ఆప్షన్లు ఇచ్చామని, అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్‌టాప్ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు.