రాజధాని నిర్మాణాలు ఆపొద్దు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పచ్చజెండా ఊపారు. ఆర్భాటాలకు వెళ్లకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనులపై సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో సీఎం జగన్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన (ఎల్పీఎస్) లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహనిర్మాణాల వంటి.. ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. ఆ పనుల పరిమాణం, ఖర్చు తగ్గించాలని సీఎం ఆదేశించారు. దానికి అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణంపై మాత్రం నిపుణుల కమిటీ నివేదిక వచ్చానే నిర్ణయం తీసుకోనున్నారు. రాజధానిలో కొనసాగించబోయే పనుల పరిమాణం, అంచనా వ్యయాల తగ్గింపు అంశాలపై ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణ పనులు డిసెంబరులోనూ, హ్యాపీనెస్ట్ పనులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.













