ఫైళ్ల క్లియరెన్స్‌లో చంద్రబాబు మార్క్ స్పీడ్..!
అమరావతి(Amaravati)లోని రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గతంలో ఇ-ఫైళ్ల క్లియరెన్స్‌కు రోజుల తరబడి సమయం పట్టేదని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారి గంటల వ్యవధిలోనే పనులు పూర్తవుతుండటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫైళ్ల పరిష్కారంలో వేగంగా స్పందిస్తున్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు మరియు సెక్రటరీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా పాలనలో వేగం గురించి ప్రస్తావిస్తూ.. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినప్పటికీ, సరాసరి 10 గంటల వ్యవధిలోనే వాటిని క్లియర్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను సీఎం కొనియాడారు. ఇదే సమయంలో ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, వేగం పెంచాలని సూచించారు. ఐటీ సెక్రటరీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుండి కేవలం 2 రోజులకు తగ్గిందని, ఇది పాలనలో వచ్చిన గొప్ప మార్పు అని సీఎం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఫైళ్లను ఎంత త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు ప్రజలకు అంత వేగంగా అందుతాయని స్పష్టం చేశారు. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’లో ఫైళ్ల క్లియరెన్స్ అత్యంత ముఖ్యమైన అంశమని, సీఎస్ స్థాయి నుండి మండల స్థాయి వరకు అందరిలోనూ ఈ వేగం కనిపించాలని ఆదేశించారు. ఇకపై మ్యానువల్ ఫైళ్లు అనేవి దాదాపు లేకుండా చూడాలని, టెక్నాలజీని అనుసంధానించడంతో పాటు పాలనలో మానవీయ కోణం (Human Touch) కూడా ముఖ్యమని గుర్తుచేశారు.
ప్రతి ఇ-ఫైల్ 24 గంటల్లోపు డిస్పోజ్ అయ్యేలా అధికారులు శ్రద్ధ పెట్టాలని, అధికారులందరి పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమోదు చేస్తోందని సీఎం హెచ్చరించారు. జిల్లా స్థాయి అధికారులు మరియు హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని, ఇ-ఆఫీస్ పరిధిలో లేని ఫైళ్లను గుర్తించి వాటిని కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించే విషయంలో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి








