ట్వీట్లో సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన సునీతా కృష్ణన్.. సీఎం రిప్లైకి ఫ్యాన్స్ ఫిదా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ వినూత్నంగా అపాయింట్మెంట్ కోరారు. సాధారణంగా పెద్ద పదవుల్లో ఉన్న వారిని కలవడం కష్టం. అందునా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవడమే కష్టం. అలాంటిది సునీతా కృష్ణన్ కేవలం ఒక ట్వీట్ చేయగానే చంద్రబాబు స్పందించారు. ఆమె తన ట్వీట్లో.. "చంద్రబాబు సర్, సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఇలా మీ అపాయింట్ మెంట్ కోరుతున్నాను. మీరు బిజీగా ఉంటారని తెలుసు. కానీ వచ్చే వారం నాకోసం దయచేసి ఒక 10 నిమిషాల మీ విలువైన సమయాన్ని కేటాయించగలరా? రెండు చాలా ముఖ్యమైన ప్రతిపాదనలను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసేందుకు, అపాయింట్మెంట్ తీసుకునేందుకు కొన్ని రోజులుగా సాధారణ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాను. కానీ అవేమీ అంత ఫలితం చూపించలేదు. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా మీ అపాయింట్ మెంట్ అడుగుతున్నాను. క్షమించండి" అని సునీతా కృష్ణన్ రాసుకొచ్చారు.
అయితే ఇలాంటి ట్వీట్లకు ఉన్నత పదవుల్లో ఉన్నవారు స్పందించడం చాలా అరుదు. అలాంటిది దీనిపై చంద్రబాబు స్వయంగా స్పందించారు. "నో ప్రాబ్లమ్ సునీత గారూ… మనం మంగళవారం కలుద్దాం. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మిమ్మల్ని మీట్ అవుతాను. మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. పాలనను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అంతేకాదు, మా అపాయింట్ మెంట్ వ్యవస్థలను కూడా ఇంకా మెరుగుపరచడానికి ఏం చేయాలో కూడా ఆలోచిను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇది చూసిన చాలామంది చంద్రబాబు రిప్లై ఇవ్వడంతోపాటు ఇలా సునీతా కృష్ణన్కు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు. కాగా, సునీతా కృష్ణన్… అమ్మాయిల అక్రమ రవాణా మాఫియాలకు ఎదురొడ్డి పోరాడి, వందల సంఖ్యలో అమ్మాయిలకు స్వేచ్ఛ ప్రసాదించిన పోరాట యోధురాలు. ప్రజ్వల ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం, ఉపాధి కల్పిస్తూ సమాజంలో మార్పు కోసం పోరాడుతున్నారు.













