CRDA:సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పూర్ణకుంభం, వేదాశీర్వచనాలతో ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో (జీG7) సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సీఆర్డీఏ, సహా, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఎ అక్షరం ఎలివేషన్‌తో తీర్చిద్దారు. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పాలనా సౌలభ్యం కోసం హెచ్‌వోడీలన్న ఒకేచోట ఉండేలా భవనాల నిర్మాణం చేపట్టారు. సీఆర్డీఏ భనవం మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తుల్లో సీఆర్డీఏ, నాలుగో అంతస్తుల్లో సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్ ఉంది. ఆరో అంతస్తులో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.