పర్యాటక కేంద్రంగా కొండపల్లి : చంద్రబాబు
కృష్ణాజిల్లా కొండపల్లికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడకు సమీపంలోని కొండపల్లి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొండపల్లి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కొండపల్లి బొమ్మలు గుర్తుకువస్తాయని అన్నారు. తెలుగుతనానికి ఒక బ్రాండని ఆయన అభివర్ణించారు. ఏకాగ్రతతో చేస్తే తప్ప ఇలాంటి బొమ్మలను తయారుచేయలేమన్నారు. కొండపల్లికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కొండపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్ల 90 లక్షల నిధులు ఇచ్చామని చెప్పారు. రాబోయే భవిష్యత్తులో కొండపల్లిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతికి వచ్చే పర్యాటకులు ఇక్కడి వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.













