24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు
ఈ నెల 24 నుంచి 26 వరకు విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 2001, 2003, 2004లలో ఈ సదస్సులు జరిగాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది వరుసగా జరిగే మూడో సదస్సు అని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సులో గతంలో కేంద్ర ప్రభుత్వ సెషన్స్ మాత్రమే జరిగేవని, ఈసారి కేంద్రానికి చెందిన 11 ఫ్లీనరీ సెషన్స్‌తో పాటు 8 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ సెషన్స్ ఉంటాయని తెలిపారు. ఈ సదస్సుకు 14 దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, 39 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు మొత్తం 2500 మందిని ఆహ్వానించామన్నారు. అనంతపురంలోని కియా ప్లాంట్‌లో రూఫ్ వర్క్ ఇన్స్టలేషన్ పనులను ఈ నెల 22న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.













