మాజీ మంత్రి నారాయణకు షాక్
పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పొంగూరి నారాయణ బెయిల్ రద్దయింది. ఈ మేరకు బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. నవంబర్ 30లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆయన్ను ఆదేశించింది. ఈ కేసులో నారాయణకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై చిత్తూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడిరచింది.
ఈ ఏడాది ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్ నుంచి పదోతరగతి ప్రశ్నపత్నం లీకైంది. వాట్సాప్ ద్వారా తెలుగు ప్రశ్నపత్నం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. నారాయణ విద్యాసంస్థ అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన ఆదారాలను సమర్పించారు. దీంతో న్యాయస్థానం అప్పట్లో బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆ బెయిల్‌ను రద్దు చేసింది.













