చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
కుప్పం పర్యటన చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ చంద్రబాబును అడ్డగించారు. దీంతో పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 14ఏళ్లు సేవలు చేసిన వ్యక్తిని ఆపుతారా? అంటూ ఆగ్రహించారు. వెంటనే పాదయాత్రగా ఆయన ర్యాలీని కొనసాగించారు. ఈ నేపథ్యంలో పెద్దూరు గ్రామంలో పాదయాత్రగా వెళుతున్నారు. ఇదే విధంగా జగన్ నియంతృత్వ ధోరణిని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించే కరపత్రాలను ఇంటి ఇంటికి తిరిగి అందించాలని, వైసీపీ అవినీతి, అక్రమ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత జగన్ ఇంటికి వెళతారని, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ తీసుకొచ్చిన జీవో1ని రాజ్యాంగంలో ఏ చట్టం కింద తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య రాజ్యంలో ఇది ప్రజాస్వామ్య గొంతును నొక్కడమేనని, ఇలాంటి వాటిని సాగనివ్వమని అన్నారు. తన ర్యాలీలు, రోడ్లపై పోలీసులు ఈ చట్టం కింద అభ్యంతరం చెబుతున్నారని, తనను ఏ చట్టం కింద అడ్డగిస్తున్నారని ప్రశ్నించారు.













