టీఆర్ఎస్ చేసిందేం లేదు.. చేసేదీ లేదు
తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ చేసిందేం లేదు.. చేయబోయేది కూడా ఏం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందంటే దాని వెనుక తెలుగుదేశం ప్రభుత్వం కృషి ముందుచూపు ఎంతో ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వారిలో మొదటి స్థానం తనదేనని చెప్పారు. ధర్మపోరాట దీక్షలో భాగంగా విజయనగరం జిల్లాలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని తానే కట్టానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేసీఆర్‌ను తానెప్పుడూ తిట్టలేదని, కానీ ఆయన మాత్రం నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారోనని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రజా కూటమి పెట్టడం కరెక్టో కాదో ప్రజలే చెప్పాలి. అక్కడ పోటీచేస్తున్నందుకు కేసీఆర్ నన్ను తిడతారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్, ఐటీ కంపెనీలు, ఐఎస్బీని తీసుకువచ్చాను. రహెజా మైండ్ స్పేస్‌ను, శంషాబాద్ ఎయిర్‌పోర్టు తీసుకొచ్చా. ఔటర్ రింగురోడ్డుకు శ్రీకారం చుట్టా. కాలేజీలు, పాఠశాలలు, హైస్కూళ్లు ఇలా ప్రతి ఒక్కటీ టీడీపీ హయాంలో వచ్చినవే. తెలుగుజాతి విద్యారంగంలో నంబర్‌వన్‌గా ఎదిగింది టీడీపీ వల్లే. అందుకే ఇక్కడ పోటీ చేసే హక్కు టీడీపీకే ఉంది. కేసీఆర్‌ను తిట్టాల్సిన అవసరం నాకు లేదు. ఆయన నన్ను ఎన్ని మాటలంటున్నారో మీరే చూడండి. ఒక్కోసారి బాధ కలుగుతుంది. తెలంగాణలో టీడీపీ ఎందుకని ఆయన అంటారు. టీడీపీ లేకుండా మీరు (కేసీఆర్) ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీఆర్ టీడీపీ పెట్టకుంటే మీరు రాజీయాల్లోకి వచ్చావారా? తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అండగా ఉండేది తెలుగుదేశం జెండా. అలాంటి టీడీపీ తెలంగాణ ఉండొద్దా? తెలంగాణ అభివృద్ధికి కష్టపడినవారిలో నంబర్‌వన్ స్థానంలో నేను ఉంటాను. ఇక జనసేన అధినేత పవన్, జగన్ తెలంగాణలో కేసీఆర్‌కు మద్దతిస్తున్నారు. ఇది న్యాయమా? వీళ్లకు కేసీఆర్‌ను చూస్తే భయం అని అన్నారు.













