Chandrababu :వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ : సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి (Anakapalle ) జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని తెలిపారు. ఈ హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని పేర్కొన్నారు. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు. గ్రీన్కో కంపెనీ కాకినాడ (Kakinada)లో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్ చేయనుంది. ఈ ప్లాంట్‌పై రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్ కంపెనీ (Reliance Company) బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోంది. ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుంది. గడ్డి పెంచడానికి ఎకరాకు రూ.30 వేలు కౌలు రైతులకు రిలయన్స్ చెల్లించనుందన్నారు. బెంగళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్‌ను కుప్పానికి తెచ్చింది. సూర్యఘర్ అమలులో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్‌కు డబ్బు చెల్లిస్తారు. దీంతో వారికి అదనపు ఆదాయం చేకూరనుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.













