పోలవరం ప్రాజెక్టుపై జగన్ కు ఈర్ష్య: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
శరవేగంగా నిర్మాణం సాగుతున్న పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఈర్ష్య పెంచుకోవడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం 64 పెద్దూరు, 63 చిన్నూరు గ్రామస్తులు పోలవరం సందర్శనకు వెళుతూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో సోమవారాన్ని పోలవారంగా మార్చి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి తమ నియోజకవర్గ శాసనసభ్యులు కావడం గర్వకారణంగా ఉందని కుప్పం ప్రజలు పేర్కొన్నారు.
ఇప్పటికే వేలల్లో కుప్పం ప్రజలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసి వచ్చి గర్వంగా చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ పనులు, రోజువారీ కూలీలు చేసుకుంటున్న తాము కూడబెట్టిన డబ్బులతో పోలవరం ప్రాజెక్టు చూడటానికి బయలుదేరామని తెలిపారు. “ఇటువంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చూసే భాగ్యం జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ధ్యాసతో వ్యయప్రయాసలకు ఓర్చి దూరాభారమైనా పోలవరం ప్రాజెక్టు చూడటానికి బయలుదేరామని’’ కుప్పం ప్రజలు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు సైతం దైనందిన వేతనాల్లో మిగిల్చుకున్న కూలీ డబ్బులతో పోలవరం చూడటానికి వెళుతుంటే ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి మాత్రం నిస్సుగ్గుగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుపడుతుండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రతి రోజూ పోలవరం చూడటానికి 8-9 వేలమంది వెళ్లి తన్మయత్వం చెందుతున్నారని గుర్తు చేశారు. ఇటీవల ఒక్కరోజే 35వేలమంది వెళ్ళిరావడం రికార్డు అని గుర్తు చేశారు. రాష్ట్ర రైతులు, ప్రజలంతా శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సరళి, భారీ యంత్ర పరికరాలు, వాహనాల సందడిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు.
దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల సామాన్యులే కాకుండా మేధావివర్గం హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే తెలంగాణా పాలకులతో కలసి పోలవరం ప్రాజెక్టును ఆపడానికి, అడంకులు సృష్టించడానికి జగన్ కుట్రలు పన్నడం హేయం, నీచాతినీచమని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి పట్ల సామాన్యప్రజలకున్నశ్రద్ధ, ఆకాంక్ష జగన్ లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. పోలవరం నిర్మాణానికి సకాలంలో కేంద్రం నిధులివ్వకపోయినా ఒక్కమాట మాట్లాడని జగన్ తగుదునమ్మా అంటూ అడ్డుపిల్లలు వేయడానికి సిద్ధపడటాన్ని ప్రజలు ఛీ కొట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రమకోర్చి పోలవరం నిర్మిస్తున్న తీరును సందర్శించడానికి వెళుతున్న సామాన్యప్రజలు జేజేలు కొడుతుంటే ఆ చాయలకే వెళ్లకపోవడంలో రాష్ట్రంలోని ప్రతిపక్షనేత జగన్ మానసిక ప్రవృత్తి తేటతెల్లం అవుతోందన్నారు.













