Chandrababu: సభలో టీడీపీ నేతల వ్యక్తిగత ఎజెండాలు.. చంద్రబాబు సీరియస్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమావేశాలు జరుగుతున్న విధానం తాజాగా కొత్త చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రతిపక్షమే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఎజెండా తీసుకువస్తుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ఎందుకంటే వైసీపీ పార్టీ (YCP) సభ్యులు సభకు హాజరు కాకపోవడం వల్ల అధికార పక్షం నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కోణంలో వ్యాఖ్యలు చేయడం, అనుకోకుండా ప్రభుత్వానికే ఇబ్బందులు కలిగించడం కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం విజయవాడ సెంట్రల్ (Vijayawada Central) ఎమ్మెల్యే బొండా ఉమ (Bonda Uma) చేసిన వ్యాఖ్యలు పెద్ద సెన్సేషన్ అయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Pollution Control Board) ఛైర్మన్ తన మాట వినడం లేదని, చివరికి తమ సమస్యలు చెప్పుకోవాలంటే పర్యావరణ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దగ్గరకే వెళ్లాల్సి వస్తుందని అన్న ఆయన వ్యాఖ్యలు బహిరంగ చర్చకు దారి తీశాయి. సొంత పార్టీ సభ్యుడు ప్రభుత్వంపై ఇలా మాట్లాడటమేంటి? అనే ప్రశ్నలు వినిపించాయి.
ఈ సంఘటన తర్వాత మరోసారి ఇలాంటి పరిణామం శుక్రవారం అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఈసారి కూన రవికుమార్ (Kuna Ravikumar), బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) అనే టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతూ, శాంతిభద్రతలపై జరిగిన చర్చలో అనవసర విషయాలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణ పాటించడంలో విఫలమైందనే భావన కలిగిందని తెలుస్తోంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అత్యంత సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం.
అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) సమక్షంలో చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ‘‘ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? సభలో వ్యక్తిగత ఎజెండాలు ఎందుకు?” అంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, సీనియర్ సభ్యులు కూడా పరిమితులు దాటడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నామనుకుని ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించినట్టుగా సమాచారం.
చంద్రబాబు అక్కడికక్కడే పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆదేశించి, అందరికీ తాను గట్టిగా చెబుతానని స్పష్టంచేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన ఇంత తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వరుసగా చోటుచేసుకుంటున్న ఈ సంఘటనలు ఆయనను చికాకు పెట్టాయని తెలుస్తోంది. కొంతమంది సభ్యులు కొత్తవారైనా, సీనియర్లైనా నియంత్రణ కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అసెంబ్లీలో ప్రతి వ్యాఖ్య ప్రభుత్వ బాధ్యతను ప్రతిబింబించేలా ఉండాలని, సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో హద్దులు దాటరాదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు చెబుతున్నారు.