పోలవరం గ్రావిటీ నుంచి జూన్ లో నీరు
మే 30న ట్రయల్ రన్
ఆరు నెలల్లో వెలిగొండ పూర్తిచేయాలి
మంగళవారం పిబిసి నుంచి చిత్తూరు జిల్లాకు నీరు
పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రాజెక్టుల నిర్మాణంలో పోలవరం ప్రాజెక్టు ఒక నమూనాగా, మంచి అనుభవంగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు, ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులు గడచిన వారాంతానికి 64.68% పూర్తయినట్లు అధికారులు గణాంకాలతో వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో గ్రావిటీ ద్వారా గ్రావిటీ ద్వారా పంటపొలాలకు పోలవరం నీరు ఖాయంగా ఇస్తామని చెప్పారు. మే నెల 30 వ తేదీన ట్రయల్ రన్‌కు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి 150 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.
పిబిసి కాల్వనుంచి చిత్తూరు జిల్లాకు మంగళవారం నీరు విడుదల
వెలుగొండ ప్రాజెక్టు పనులను అధికారులు తాను చెప్పినట్లుగా పూర్తి శ్రద్ధతో సకాలంలో పూర్తిచేయడంలేదన్నారు. చెర్లో పల్లి నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లే ట్రయల్ రన్ పూర్తయ్యిందని, మంగళవారం జలహారతితో అధికారికంగా నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
కాల్వలకు గండ్లు పడిన చోట్ల వెంటనే పూడ్చివేతకు చర్యలు తీసుకోవాలని, గండ్లు పడకుండా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకువెళుతున్నామని, చిత్తూరు జిల్లవాసుల దశాబ్దాల కలను నిజం చేశామని ముఖ్యమంత్రి వివరించారు. ఎన్టీరామారావు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను తాము పూర్తిచేస్తున్నామని సీఎం అన్నారు.
జూన్, జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలి
ప్రాధాన్య ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు సొరంగ మార్గ పనులు జూన్, జూలై నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కంట్రాక్టర్లను ఆదేశించారు.వీడియో లింక్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వెలిగొండ పనులు మందగించాయని, ఇప్పుడు ఇదే స్థాయిలో పనులు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావడానికి 16 నెలలు పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అంత వ్యవధి తీసుకోవడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తనను మెప్పించడానికి కాకుండా, వాస్తవికంగా పనులు వేగంగా చేసి చూపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. రెండువైపులా వారానికి 20 మీటర్ల వంతున పనులు చేసినా మరో ఆరునెలలు పడుతుందని ఆయన అన్నారు. ఆరు నెలలు కష్టపడి ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పనిచేసి వేగంగా పూర్తిచేయవచ్చన్నారు. ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తిచేసి అప్పగించాలని కోరారు. గేట్ల బిగింపు పనుల్లో అనుభవం ఉన్న నవయుగ కంపెనీ సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘నేను ప్రతిరోజూ చెబుతున్నా. ఉపేక్ష వద్దు. నాకు వెలిగొండ చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. వేగంగా పూర్తిచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల కంపెనీల ప్రతినిధులు మాట్లాడారు.













