ఏ ముఖ్యమంత్రి ఈ ఆలోచన చేయలేదు : చంద్రబాబు
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించాలని నిర్ణయించడం జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వ హయాంలో ఆ సంస్థకు ఆయన పేరు పెట్టాం. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలాయానికి ఆయన పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం అన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేరు మార్చుతోందన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతోంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్లు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల నాటి సంస్థలకు పేరు మార్చి కొత్త మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా.. ప్రజలు మీ దిగజారుడుతనాన్ని చీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.













