ఎన్ఐఆర్ఎఫ్ నివేదికను పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టంగా
వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం నాశనం అయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్సిటీలకు ర్యాంకులు కేటాయిస్తూ కేంద్ర ఉన్నత విద్యా శాఖ విడుదల చేసిన నివేదికను ప్రస్తావించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో వర్సిటీల ర్యాంకింగ్ పడిపోతోంది. ఎన్ఐఆర్ఎఫ్ నివేదికను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. 2019లో 29వ ర్యాంక్‌లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ నేడు 76వ స్థానానికి పడిపోయింది. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ కనీసం టాప్ 100లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. యూనివర్సిటీల్లో అధ్యాపకులు పోస్టులు భర్తీ చేయకపోవడం, వర్సిటీలను వైసీపీ రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది అని అన్నారు.













