బాబుకి కూటమి భారమయ్యేనా.. బీజేపీ పరిస్థితి ఏమిటో?
టీడీపీ తో బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి.. అయినా కానీ ఎన్నికల ప్రచార భారం మొత్తం చంద్రబాబు భుజస్కందాల మీదే మోస్తున్నట్లు కనిపిస్తోంది. ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి.. అపర రాజకీయ చాణిక్యుడు.. ఎన్నో సమస్యలను తట్టుకొని నిలిచిన వాడే కానీ ఏడుపదుల వయసులో ఏకంగా రోజుకు మూడు సభల చొప్పున పాల్గొనడం అంటే కష్టమే కదా. అయినా సరే చంద్రబాబు మండుటెండలో వరుస సభలతో బిజీగా ఉన్నారు. ఇక కూటమిలో భాగమైన జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఈసారి అక్కడ గెలవడం సవాల్ గా తీసుకున్న పవన్ ఏకంగా తన నివాసాన్ని అక్కడికే షిఫ్ట్ చేశారు. ఉగాది వేడుకలు కూడా పిఠాపురంలోనే జరుపుకుంటున్నారు. పిఠాపురం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ జ్వరం కారణంగా వెళ్లలేకపోయారు. రెండు రోజుల చిన్ని షెడ్యూల్ తో ఉత్తరాంధ్రాకి వెళ్లి వస్తున్నాడు పవన్. ఇక ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ బీజేపీ.. స్థానికంగా పెద్ద బలమైన పార్టీ కాకపోయినప్పటికీ జాతీయస్థాయిలో దీని రేంజ్ బాహుబలి తో సమానం. మరి ఆ పవర్ ఫుల్ ఇంపాక్ట్ ఆంధ్రాలో చూపిస్తేనే కదా చంద్రబాబుకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్రస్థాయిలో బీజేపీ పూర్తిగా ఎన్నికల ప్రచారంలో దిగలేదు. ఇంకా ఎందుకో క్యాండిడేట్ల సెలక్షన్ ప్రక్రియలోనే ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతానికి కూటమి భారం మొత్తం చంద్రబాబే మోస్తున్నారు.













