వారికి ఓటేస్తే.. మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని కుటుంబ స్థాపనే నా లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు టీచర్లతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వారికే ఓటేయండని ఆయన కోరారు. ఒక్కో టీచర్ కు రూ.5 వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, అవినీతి డబ్బుతో ఉపాధ్యాయ ఓట్లు కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేకున్నా ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం హెచ్చరిస్తున్నానన్నారు. వైసీసీ అభ్యర్థులకు ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనని అన్నారు.
ఎన్నికలయ్యాక మీ జీతాల్లో కోత పెట్టడంతో పాటు ఇతర్రతా అన్ని సౌకర్యాలు లేకుండా చేస్తారని, రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లనూ గౌరవించేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎందరో జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు నేడు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమైపోయిందన్నారు. న్యాయ వ్యవస్థకి జగన్ వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ నేడు మనగడ కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం సమిష్ఠిగా పోరాడాల్సిన అవసరం అందరిపైనా ఉందని అన్నారు.













