అమరావతికి మోదీ సుముఖంగా ఉంటే.. మీకెందుకు అంత పట్టుదల?
ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూసి అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు నాంది పలికారని, ఆయన స్ఫూర్తితోనే విభజన తర్వాత రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశామన్నారు. వల్లభాయ్ పటేల్ దేశాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేశారన్నారు. అమరావతిలో తాము తలపెట్టినట్లుగానే పార్లమెంటులోనూ అన్ని కార్యాలయాలను ఒకేచోటుకి చేర్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులంటూ వితండవాదమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏడాదిగా అమరావతి కోసం రైతులు, మహిళలు పోరాడుతున్నారని చెప్పారు. బీజేపీ కూడా అమరావతికి అనుకూలమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ కూడా రాజధాని అమరావతికి సుముఖంగా ఉన్నపుడు సీఎం జగన్కు అంత పట్టుదల ఎందుకని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఆ పార్టీ నేతలు దళారులుగా మారారని ఆరోపించారు. వైకాపాది దుర్మార్గ, దుష్ట పరిపాలన అని ఆయన మండిపడ్డారు.













