Chandrababu: ఎన్ని సార్లు అడగాలి…? రిపోర్ట్ లు ఏవి…?
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రుల పనితీరుపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu naidu) అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాస్త సీరియస్ గా కనబడుతున్నారు. క్యాబినెట్ లో కొత్తవారు ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పిస్తే కొందరు కనీసం ముఖ్యమంత్రి మాట కూడా లెక్కచేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా శాఖల వారీగా రిపోర్టులు అడుగుతున్నప్పుడు మంత్రుల నుంచి స్పందన ఉండటం లేదు. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించారు.
తాను మూడు, నాలుగు సార్లు రిపోర్టులు అడిగానని.. అయినా సరే మంత్రులు లెక్కచేయడం లేదని, వైఖరి ఇలాగే ఉంటే మాత్రం తాను కూడా కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందని, తనకు సోమవారం లోపు శాఖల వారీగా రిపోర్టులు కావాల్సిందేనని కొంతమంది మంత్రులకు స్పష్టంగా చెప్పారట చంద్రబాబు. అలాగే క్యాబినెట్ సమావేశాన్ని కూడా మంత్రులు సీరియస్ గా తీసుకోవడం లేదని తూతూ మంత్రంగా క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతున్నారని, అలాగే మీడియా సమావేశాలకు కూడా మంత్రుల దూరంగా ఉండటం కరెక్ట్ కాదని హెచ్చరించారట.
అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఇదే వైఖరి ప్రదర్శించారని, ఈ అలసత్వ పద్ధతి విడనాడితే మంచిదని చంద్రబాబు సూచించారు. మీడియాలో కనపడకపోతే ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని, అలాగే మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందేనని చంద్రబాబు నాయుడు మంత్రులకు గట్టిగా హెచ్చరికలు పంపారు. కేవలం తమ శాఖలపై మాత్రమే కాకుండా ఇతర శాఖలపై కూడా అవగాహన తెచ్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ఒక అవగాహన ఉండాలని సూచించారు సీఎం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం తమ శాఖలపైనే కాకుండా ఇతర శాఖలపై కూడా పట్టు పెంచుకుంటే మంచిదని.. తమ తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మంత్రులు కచ్చితంగా టచ్ లో ఉండాల్సిందేనని.. లేదంటే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారట. సమస్యలు ఉంటె చూసి చూడనట్టు వదిలేయడం కాదని… తన వద్దకు తీసుకురావాలని సూచించారట.













