జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ : జగన్
కరోనాతో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. స్పందన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడం పాటు వివిధ అంశాలపై వారికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 104కి ఫోన్ చేస్తే కరోనా పరీక్షలు, ఆస్పత్రుల వివరాలు అందాలని, ఆ నవంబర్‌కు మాక్ కాల్స్ చేయగానే పనిచేస్తోందా? లేదా? అనే విషయాన్ని అధికారులు తనిఖీ చేయాలని చెప్పారు. 104కి ఫోన్ చేయగానే బెడ్ అందుబాటులో ఉందో లేదో అరగంటలో చెప్పాలన్నారు.
ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనని వివరించారు. కొవిడ్ ఆస్పత్రుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యంత్రి అధికారులను ఆదేశించారు. కొవిడ్ కేర్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఉండాలని సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందకపోతే జిల్లా కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాలని సీఎం సృష్టం చేశారు. కొవిడ్ బాధితులను త్వరగా గుర్తిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందని జగన్ చెప్పారు.













