కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ.. చంద్రబాబు తాజా టార్గెట్..!
వై నాట్ 175 అనేది ఈసారి వైసీపీ లక్ష్యం. అంటే ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలనేది ఆ పార్టీ టార్గెట్. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించాం కాబట్టి ఈసారి అన్ని స్థానాల్లోనూ గెలవడం పెద్ద సమస్య కాబోదనేది జగన్ ఆలోచన. అదే జరిగితే కంచుకోట కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోవాలి. వాస్తవానికి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారి కచ్చితంగా ఓడిస్తామని గట్టిగా చెప్తోంది. అయితే ఓడించడం పక్కన పెడితే.. తాను ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైసీపీకి తన సత్తా ఏంటో చాటాలనుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
కుప్పం చంద్రబాబు నాయుడు కంచుకోట. 1989 నుంచి ఆయన ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటివరకూ 7 సార్లు గెలుపొందారు. పార్టీ అధినేతగా ఉండడం, కొన్నిసార్లు పదవిలో ఉండడంతో చాలాసార్లు ఆయన కుప్పంలో ప్రచారానికి కూడా వెళ్లేవారు కాదు. కనీసం నామినేషన్ కూడా వెళ్లని సందర్భాలున్నాయి. దీన్ని బట్టి కుప్పంపై చంద్రబాబుకు ఉన్న పట్టు ఎంతో అర్థం చేసుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ బాగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ 60వేలకు పైగా వచ్చే మెజారిటీ గత ఎన్నికల్లో 30 వేలకు దిగజారింది. దీని ప్రభావం చిత్తూరు పార్లమెంటు స్థానంపైనా పడింది. గతంలో కుప్పంలో వచ్చే మెజార్టీతోనే చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ దక్కించుకునేది. కానీ గత ఎన్నికల్లో కోల్పోవాల్సి వచ్చింది.
గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ భారీగా తగ్గడంతో వైసీపీకి ఈ స్థానంపై కన్ను పడింది. గట్టిగా ట్రై చేస్తే ఇక్కడ బాబును ఓడించడం పెద్ద కష్టం కాదనే నిర్ణయానికి వచ్చింది. అందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడు భరత్ కు ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. దీంతో భరత్ యాక్టివ్ అయ్యారు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుకోవడంతో మరింత నమ్మకం కలిగింది. అందుకే ఈసారి కుప్పంలో కూడా ఓడించబోతున్నామని గట్టిగా చెప్తూ వస్తోంది.
బహుశా వైసీపీ బెదిరింపులకు భయపడ్డారో ఏమో.. చంద్రబాబు కుప్పంపై స్పెషల్ అటెన్షన్ పెట్టారు. గతంలో ఎన్నడూ కుప్పంను పెద్దగా పట్టించుకోకపోయినా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు.. ఈసారి మాత్రం అలా చేయట్లేదు. ప్రతి మూడు నెలలకోసారి కుప్పం వెళ్తున్నారు. మూడు రోజులపాటు అక్కడే మకాం వేసి టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు కుప్పం టీడీపీ శ్రేణులకు సరికొత్త టార్గెట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తనను ఇక్కడ వైసీపీ ఓడిస్తామంటోందని.. కానీ మనం లక్ష ఓట్ల మెజారిటీతో బుద్ధి చెప్పాపని టీడీపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం తాజా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి గడపకూ వెళ్లి గట్టిగా ప్రచారం చేయాలని.. కుప్పం తమ కంచుకోట అని ప్రూవ్ చేయాలని చంద్రబాబు సూచించారు. మొత్తానికి వైసీపీ ఓడించాలని చూస్తుంటే.. చంద్రబాబు మాత్రం లక్ష ఓట్ల మెజార్టీతో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. మరి ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.













