అదంతా తన ఒక్కడి ఘనత కాదు అధికారులదే
నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయని, అదంతా తన ఒక్కడి ఘనత మాత్రమే కాదని అధికారులు, మంత్రులు, కార్యదర్శులు అందరిదీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ అవార్డులు సాధించిన అధికారులకు గ్రీవెన్స్ సెల్లో వేడుకగా సత్కరం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాలుగేళ్లు రాత్రింబవళ్లు పనిచేసి రాష్ట్రాన్ని గాడిలోపెట్టామని, వివిధ శాఖల్లో అనేక అవార్డులు సాధించామని అన్నారు. అధికారుల పనితనంలో చూపించిన సామర్థ్యమే ఈ గుర్తింపు అని పేర్కొన్నారు. దాదాపు 300 మందికి అవార్డులు వ్యక్తిగతంగా, శాఖా పరంగానూ వచ్చాయని అన్నారు. వృద్ధిరేటులో మన రాష్ట్రం నంబర్-1గా నిలిచిందని, నాలుగేళ్ల వృద్ధి రేటు సగటులో అగ్రగామిగా ఉన్నామని అన్నారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నామని, 2022 కన్నా ముందే లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్‌లో టాప్ 10లో మూడు మన రాష్ట్రానికే వచ్చాయని తెలిపారు. ఈ ఘనత అందరిదీ అని అన్నారు.













