చంద్రబాబుపై ఎఫ్ఐఆర్..! తననే చంపాలనుకున్నారన్న టీడీపీ అధినేత..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రతీకార రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం కూడా అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని రెచ్చగొడుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు పార్టీల నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనిపై కేసు నమోదైంది. అయితే తనపైనే వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఎస్పీజీయే ఇందుకు సాక్ష్యమని చంద్రబాబు చెప్తున్నారు..
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ప్రాజెక్టుల బాట పట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడం మానేసిందని ఆరోపిస్తున్నారు. నేరుగా ప్రాజెక్టులను సందర్శించి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలనేది ఆయన ఆలోచన. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. చంద్రబాబుపై రాళ్లతో దాడి చేస్తారేమోనని భావించి ఎస్పీజీ ఆయనకు అడ్డుగా నిలబడింది. ఇదే సమయంలో చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడారు. తరమండి నా కొడుకులను.. అంటూ టీడీపీ నేతలను పురమాయించారు. దీనిపై వైసీపీ నేత ఉమాపతి రెడ్డి కురబలకోట మండలం ముదివీడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. చంద్రబాబును ఏ1గా చేర్చారు. దేవినేని ఉమను ఏ2గా, అమర్నాథరెడ్డిని ఏ3గా, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ఏ4గా బుక్ చేశారు. ఇంకా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపైన కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన్ను ఎలాగైనా జైలుకు పంపించాలనే లక్ష్యంతోనే ఇలాంటి కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు స్పందించారు. తనపైనే వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఎస్పీజీ కమాండ్స్, మీడియా ఇందుకు సాక్ష్యమని చెప్పారు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఎవరు ఎత్తి చూపినా వాళ్లందరిపైనా కేసులు పెట్టి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నా ప్రోగ్రామ్ కి వైసీపీ నేతలు రావాల్సిన పనేంటని చంద్రబాబు ప్రశ్నించారు.













