ఆ అవకాశాన్ని వదులుకుని… ఎందుకు ముందస్తుకు వెళ్తాం?
మూడు రాజధానులే వైసీపీ విధానమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని అన్నారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధిపొందినవారే తప్ప నిజమైన రైతులెవరు ఉద్యమంలో లేరని ఆరోపించారు. రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనేది తమ అభిప్రాయమన్నారు. న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకుంటే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఊరంటే శ్మశానం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానం అన్నా. నివాసయోగ్యమైనందున అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాం అని తెలిపారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించనన్నారు. ఐదేళ్లు ప్రజలు పాలించాలని అవకాశమిచ్చారని, ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుని.. ముందస్తుకు వెళ్తాం అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం తన వైఫల్యంగానే భావిస్తున్నానని తెలిపారు.













