టాప్ గేర్ లో మంత్రి బొత్స..
మంత్రి బొత్స ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వం తరపున తెగ మాట్లాడేస్తున్నారు. రాజధానిగా విశాఖ మారుతుందని గట్టిగా చెబుతున్నారు. అంతే కాదు… రాయలసీమ ద్రోహి జగన్ అన్న చంద్రబాబుకు గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని చంద్రబాబు ప్రస్తావించడంతో.. హైటెక్ సిటీ కట్టామని చెబుతారుగా.. మరి అది ఇప్పుడు నీటిలో మునిగింది. దీనికేం చెబుతారని లాజిక్ లాగారు.
అంతే కాదు.. నీ పెతాపం.. నాపెతాపం అన్నట్లుగా మీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. మీకుప్పాన్ని, మా చీపురుపల్లిలో అభివృద్ధిని పోల్చి చూద్దాం.. రండి డిబేట్కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. గ్రామగ్రామానికి వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షిస్తే..మీకు అర్థమవుతుందన్నారు. మా నియోజకవర్గమే .. మీ కుప్పంపై బెస్టుగా ఉంటుందని గట్టిగా చెప్పారు.
మాజీమంత్రి అశోక్ గజపతిరాజును బొత్స వదల్లేదు. మీరెన్నాళ్లు మంత్రిగా చేశారో.. మేం అన్నేళ్లు చేశాం.. మీ పాలనలో విజయనగరంలో ఓ డిగ్రీ, జూనియర్ కాలేజ్ కూడా మంజూరు చేయలేకపోయారు. ఇంకా ఏం మాట్లాడతారని సెటైర్ వేశారు. మా పాలన చూడండి. ఏం కావాలన్నా ఇట్టే మంజూరు చేసుకుంటున్నాం. ఇదీ మీకు , మాకు ఉన్న తేడా అని రాజుగారికి చురకలు వేశారు.
ఇక అంతేకాదు.. ఇటీవల తెలంగాణ మంత్రులు.. ఏపీ అభివృద్ధిపై మాట్లాడినప్పుడు బొత్స తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించుకోవడం చేతకాదు.. కానీ ఎందుకీ పోలికలు అన్నారు. దీంతో తెలంగాణ మంత్రులకు ఎక్కడో కాలింది. వరుసగా బొత్సపై ప్రెస్ మీట్లు పెట్టి, విరుచుకుపడ్డారు. అయితే దీనిపై తర్వాత స్పందిస్తానని బొత్స కామెంట్ చేసి వదిలేశారు. దీంతో రాజకీయంగా బొత్స మరోసారి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.













