కన్ఫ్యూజన్ లో ఏపీ బీజేపీ నాయకులు
వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీ గేమ్ ప్లాన్ అంతా గందరగోళంగా ఉంది. ఓవైపు జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. అయితే జనసేన.. టీడీపీతో పోటీకి సిద్ధమైపోతోంది. రాష్ట్ర బీజేపీ మాత్రం టీడీపీకి దూరమంటూ… సైకిల్ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. మరి ఈదశలో కమలం.. ఎలా సమరంలో నిలవనుంది. ఇప్పుడిదే అంశం.. ఆపార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.
ఏపీ బీజేపీ నాయకులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. హైకమాండ్ వైఖరి తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. వైసీపీతో పోరాటం చేయాలని ఆదేశాలిస్తారు. తీరా జగన్ సర్కారుతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటున్నట్టు సంకేతాలిస్తారు. అటు టీడీపీని కుటుంబ పార్టీగా అభివర్ణిస్తారు. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటిస్తారు. తీరా పార్టీ అధినేతను ఢిల్లీ పిలిచి మరీ చర్చిస్తుంటారు. పవన్ కళ్యాణ్ తమ మిత్రడనే సెలవిస్తారు. కానీ ఆయనతో ఉమ్మడి కార్యాచరణేదీ చేయరు. జనసేనతో కలిసి కార్యక్రమాలు చేపట్టరు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో వరుసగా పర్యటించనున్నారు. తిరుపతిలో నడ్డా పర్యటన జరగనుంది.. ఈ పర్యటనలో నడ్డా పొలిటికల్ గా శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. నడ్డా నేరుగా జగన్ పై విమర్శలు చేసినా, పరోక్షంగా విమర్శలు గుప్పించినా.. అది వైసీపీకి రాంగ్ సిగ్నల్ పంపించినట్లు భావించవచ్చు.ఇదే సమయంలో జనసేనతో తమ మితృత్వాన్ని మరోసారి చాటుకునే అవకాశముంది. చంద్రబాబు హస్తిన పెద్దలను కలిసినందువల్ల \.. ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకూ కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.
అయితే ఈసారి నడ్డా ఏపీ పర్యటన తర్వాత క్లారిటీ వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో తమ ప్రత్యర్థి ఎవరన్నది తేలిపోతుందని.. దానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందంటున్నారు.ఏదేమైనా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే మాత్రం.. వైసీపీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గెలుపు ఫార్ములాను బీజేపీ హైకమాండ్ వదులుకోదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.













