Bhuma Family: భూమా పిల్లలకు ఏంటీ పరిస్థితి..?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో (Kurnool district) భూమా కుటుంబానికి (Bhuma Family) ప్రత్యేక చరిత్ర ఉంది. ఆళ్లగడ్డ (Allagadda), నంద్యాల (Nandyal) నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా ఈ కుటుంబానికి పట్టుంది. భూమా నాగిరెడ్డి (Bhuma Nagireddy) – శోభా నాగిరెడ్డి (Sobha Nagireddy) దంపతులు జిల్లాలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. టీడీపీ, వైసీపీ, ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేసినా వాళ్ల వ్యక్తిగత ఇమేజ్ తోనే పదవులు పొందారు. అయితే రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మృతి చెందడం, ఆ తర్వాత కొన్నేళ్లకు భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. పిల్లలు అఖిలప్రియ (Akhila Priya), మౌనిక (mounika), జగత్ విఖ్యాత్ రెడ్డి (Jagatvikhyath Reddy) అటు కుటుంబాన్ని, ఇటు రాజకీయాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భూమా శోభా నాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియ ఎమ్మెల్యే (MLA) అయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు వైఎస్ జగన్ బంధువుతో పెళ్లయింది. అయితే వాళ్లిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఇదే సమయంలో భూమాకు అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో (AV Subba Reddy) అఖిలప్రియకు విభేదాలు వచ్చాయి. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు కూడా పెట్టారు అఖిలప్రియ. భూమా దంపతులు బతికి ఉన్నప్పుడు కుడిభుజంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డిపైనే కేసులు పెట్టడం సంచలనం కలిగించింది. మరోవైపు హైదరాబాద్ లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో అఖిలప్రియ దంపతులతో పాటు మౌనిక, జగద్విఖ్యాత్ రెడ్డిపైన కూడా కేసులు నమోదయ్యాయి.
భూమా దంపతుల రెండో అమ్మాయి భూమా మౌనిక బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లాడింది. వాళ్లకో బాబు కూడా పుట్టాడు. అయితే వాళ్ల కుటుంబం కూడా ఎంతోకాలం నిలబడలేదు. విడిపోయారు. ఆ తర్వాత మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ను పెళ్లాడింది. వీళ్లిద్దరికి ఇటీవలే ఓ పాప జన్మించింది. మౌనికను మనోజ్ (Manchu Manoj) పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు (Mohan babu) కుటుంబానికి ఇష్టం లేదు. అయితే భార్య, కుమార్తె పట్టుదలతో వాళ్ల పెళ్లిని ఘనంగా నిర్వహించారు మోహన్ బాబు. అయితే ఆ తర్వాత మళ్లీ గ్యాప్ ఏర్పడింది. ఇటీవల తండ్రీకొడుకులు కొట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. దీనంతటికీ కారణం భూమా మౌనికేనని మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు.
జగద్విఖ్యాత్ రెడ్డికి ఇంకా పెళ్లికాలేదు. అయినా అతనిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అఖిలప్రియ, మౌనిక కూడా ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్నారు. టీడీపీ అండదండలు ఉండడంతో భూమా అఖిలప్రియ నెగ్గుకు రాగలుగుతున్నారు. అయితే.. రాజకీయపరంగా ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పుడు మౌనికపైనే మోహన్ బాబు వేలెత్తి చూపుతున్నారు. ఈమె చెప్పుడు మాటల వల్లే మనోజ్ పాడైపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. భూమా దంపతుల మరణానంతరం ఆస్తి తగాదాలు చుట్టుముట్టాయి. పిల్లల మధ్య కూడా ఆస్తి పంపకాలకు సంబంధించి గ్యాప్ ఉన్నట్టు సమాచారం. తల్లిదండ్రులే జీవించి ఉంటే పిల్లల భవిష్యత్తు ఇలా ఉండేది కాదని ఆ కుటుంబ సన్నిహితులు చెప్పుకుంటున్నారు.













