ఘనంగా మహానాడుకు ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న వేడుక కావటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. విజయవాడలో ఎన్టీఆర్ హయాంలో మూడు మహానాడులు జరగ్గా, చంద్రబాబు హయాంలో జరుగుతున్న తొలి మహానాడు ఇదే కావడం విశేషం. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పార్టీ ముఖ్య నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించి మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ విభాగాల నేతలు పాల్గొన్నారు. మొత్తం 2 లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధాన స్టేజీ 60 అడుగుల పొడవు 120 అడుగుల వెడల్పుతో మొత్తం 250 మంది ఆశీనులయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. 50వేల చదరపు అడుగుల ప్రాంగణంలో ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరం వంటిని ఏర్పాటు చేయనుండగా, మరో లక్షన్నర చదరపు అడుగుల ప్రాంగణంలో మహానాడు నిర్వహణ శిబిరం ఏర్పాటు కానుంది.













