శాశ్వత హైకోర్టుకు భూమిపూజ
నవ్యాంధ్ర రాజధానిలో మరో చారిత్రాత్మక ఘట్టానికి తెర లేచింది. రాష్ట్రంలో న్యాయ పాలన నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక హైకోర్టును సిద్ధం చేసింది. దీంతో పాటు 42 ఎకరాల్లో రూ.732 కోట్లతో నిర్మించనున్న శాశ్వత ఐకానిక్ హైకోర్టు భవనానికి ఆదివారం శంకుస్థాపన చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు…హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణాల నడుమ భూమి పూజ చేశారు.
అనంతరం శిలాఫలాకాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు. శాశ్వత హైకోర్టు భవన సముదాయాలు రెండేళ్లలో నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో నిర్మితమవుతున్న జస్టిస్ సిటీ, అసెంబ్లీ, సెక్రటేరియట్ తో పాటు చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వివరాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. సీఆర్డీయే కమిషనర్ సీహెచ్.శ్రీధర్ వీడియో ప్రదర్శన ద్వారా అమరావతిలో చేపట్టిన పనుల వివరాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు జడ్జీలు ఎన్వీ.రమణ, ఆర్.సుభాష్ రెడ్డి, ఎల్.నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పి.ప్రవీణ్ కుమార్, టీబీ.రాధాకృష్ణ తో పాటు పలువురు న్యాయమూర్తులు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమమహేశ్వరావు, ఎం.పి. కనకమేడల రవీంద్ర కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ, డీజీపీ ఆర్.పి.ఠాకూర్, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, విజయవాడ, గుంటూరు జిల్లాల న్యాయవాదులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.













