Bala Krishna: తన టికెట్ ఆమెకు అంటున్న బాలయ్య..ఇది కుదేరేనా?
హిందూపురం (Hindupuram) పేరు చెప్పగానే తెలుగుదేశం పార్టీ(Telugu Desam party) అభిమానులకు గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ నియోజకవర్గం తో నందమూరి కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. ఎన్టీఆర్ (NTR) రాజకీయాల్లోకి వచ్చాక ఇక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) 2024 ఎన్నికల విజయంతో అదే రికార్డును సమం చేశారు. బాలయ్య 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచి హిందూపురం తన అడ్డాగా మార్చుకున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం హిందూపురంలో టీడీపీకి ప్రత్యర్థులు లేకుండా పోయారు. ప్రత్యేకంగా వైసీపీకి నాయకత్వ సమస్య ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ బాలయ్య పోటీకి దిగి గెలవడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయ్య సినీ, రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.
హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన బాలయ్య స్థానం మరింత బలపడింది. ఆయన పోటీ చేసినంత కాలం టికెట్ ఖాయం అనే స్థాయికి టీడీపీ హిందూపురంలో ఎదిగింది. అయితే, ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. బాలయ్య మాటల సందర్భంలో హిందూపురం టికెట్ తన సతీమణి వసుంధరకు ఇవ్వమని అడుగుతూ ఉంటారని చెప్పారు. దీంతో ఇది సరదాగా చెప్పారా లేక నిజంగానే వసుంధరకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా అనే చర్చ మొదలైంది.
ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాల్లో వసుంధర కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రజలకు ఆమెతో మంచి పరిచయం ఉంది. అందుకే, వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ ఇస్తారా అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, చంద్రబాబు మాత్రం ఒకే కుటుంబానికి ఒక్కటే టికెట్ అనే విషయాన్ని వేదిక మీదే నవ్వుతూ చెప్పారు. బాలయ్య కూడా సరదాగా “రెండు టికెట్లు” అని స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇంకా ఎన్నికలకు నాలుగేళ్లు సమయం ఉంది. అప్పటివరకు హిందూపురం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరు అన్నది స్పష్టత రానుంది. కానీ, ఇప్పటి పరిస్థితులను చూస్తే బాలయ్య మళ్లీ పోటీ చేసి హిందూపురంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, వసుంధర రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? లేదా బాలయ్య కేవలం సరదాగా అన్నారా? అనే విషయాన్ని కాలమే చెప్పాలి.













