ఈ ఘటనపై ఇప్పటికే సీఐడీ విచారణ : అవంతి
విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరమని ఆంధప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాముడి విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి విజయనగరంలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. రామతీర్థం ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని అవంతి అనుమానం వ్యక్తం చేశారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణి చంద్రబాబు మనుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇతర దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు, రామతీర్థం ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైకాపా గెలవడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు పార్టీ ప్రయోజనాల కోసం రామతీర్థం వచ్చారని, రాముడిపై భక్తితో కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేన పార్టీలకు రాష్ట్రంపై అభిమానం ఉంటే విభజన హామీలైన రైల్వేజోన్, విశాఖ-చెన్నై కారిడార్ వంటి అభివృద్ధి హామీలను అమలు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతాపార్టీ, జనసేన నాయకులు సహకరించాలని కోరారు.













