త్వరలో అమెరికాలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం శాఖ
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం (ఎఎఎ) అమెరికా శాఖను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం పాలక వర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎఎఎ శాఖను అమెరికాలో ప్రారంభించడం వల్ల ఏయూ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఉన్నతమైన స్థానాల్లో పూర్వ విద్యార్థులు ఉన్నారని వారి సహాకారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 10న పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులకు సమాచారం పంపించాలన్నారు. 2 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాదికి వర్సిటీలో మెంబర్లు అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే పది కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉండే విధంగా వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇథియోపియా, నేపాల్ దేశాల్లోనూ శాఖలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, కోశాధికారి ఆచార్య ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆచార్య మోహన్ వెంకట్రావ్, సంయుక్త కార్యదర్శి కుమార్‌రాజా, ఆకుల చంద్రశేఖర్, మాజీ రెక్టార్ ఆచార్య ప్రసన్నకుమార్, విజయ్‌నిర్మాణ్ అధినేత డాక్టర్ విజయ్‌కుమార్, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.













