విజయవాడలో కారుతో ముగ్గురి సజీవ దహన యత్నం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో రౌడీయిజం, కొట్లాటలు, హత్యలు ఇవేవీ కొత్త కాదు. కాని ఎన్నడూ లేని విధంగా కారులో ఉన్న మనుషుల్ని కారులో ఉండగానే సజీవదహనం చేసి మరీ హత్య చేయాలనుకోవడం నగరప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం… నగరంలోని నొవోటెల్ హోటల్‌కు సమీపంలో ఓ కారులో కృష్ణా రెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్ రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా చర్చల మధ్యలో కారు నుంచి వేణుగోపాల్ రెడ్డి బయటకి వచ్చాడు. బయటకు రాగానే కారులో నుంచి ఎవరూ దిగడానికి వీలు లేకుండా పూర్తిగా లాక్ చేసేశాడు. అనంతరం కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కారు అగ్నికీలల్లో చిక్కుకోగానే కారు దహనం ద్వారా ముగ్గురిపై హత్యాయత్నం చేసిన వేణుగోపాల్ రెడ్డి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మంటలు ఆర్పి తీవ్రగాయాలతో ఉన్న ముగ్గురినీ బయటకు వెలికి తీశారు. ఆసుపత్రికి తరలించారు. వీరిలో నాగమల్లి, కృష్ణా రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరు నలుగురూ చాలా సేపు కారులో కూర్చుని ఉన్నారని, ఒక స్థల వివాదం గురించి మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. ఈ వివాదంపై చర్చిద్దామని మిగతా ముగ్గుర్నీ వేణుగోపాల్‌రెడ్డి పిల్చినట్టు సమాచారం. మంటల్లో కారు పూర్తిగా దగ్థం అయింది. ఘటనా స్థలాన్ని డీసీపీ హర్ష వర్ధన్ రాజు సందర్శించారు.













