YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులు నీరుగారుతున్నాయా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అక్రమాస్తుల కేసు గత దశాబ్ద కాలంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఈ కేసులో సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీట్లు, వివిధ కంపెనీలతో జగన్ ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలు, విచారణలో జాప్యం వంటి అంశాలు ఈ కేసును సంక్లిష్టంగా మార్చాయి. కొంతకాలం కిందట ఇండియా సిమెంట్స్ కు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ కూడా ఇదే దిశగా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు 2011లో సీబీఐ దర్యాప్తుతో మొదలైంది. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) హయాంలో వివిధ కంపెనీలకు అనుకూలంగా భూమి కేటాయింపులు, లీజులు, ఇతర ప్రభుత్వ సహకారం అందించినందుకు బదులుగా జగన్ ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ లావాదేవీల ద్వారా జగన్ యాజమాన్యంలోని సంస్థలైన సాక్షి మీడియా, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ వంటి వాటికి పెట్టుబడుల రూపంలో భారీ మొత్తాలు అందాయని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో దాదాపు 100 మంది సహ నిందితులు ఉన్నారు. వీళ్లలో వివిధ కార్పొరేట్ సంస్థలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో దాల్మియా సిమెంట్స్ (Dalmia Cements), ఇండియా సిమెంట్స్ (India Cements), రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి సంస్థలపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయి. దాల్మియా సిమెంట్స్ రూ.95 కోట్ల పెట్టుబడి పెట్టి తద్వారా జగన్ సంస్థలకు రూ.55 కోట్లు హవాలా మార్గంలో చేర్చినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దాల్మియా ఉద్యోగి జయదీప్ బసు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో లభించినట్లు పేర్కొంది.
2022లో ఇండియా సిమెంట్స్ కు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు బలహీనమవుతుందా అనే అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దాల్మియా సిమెంట్స్ కూడా తమపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ కె.లక్ష్మణ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. దాల్మియా తరపున టి.నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. చట్టవిరుద్ధ లీజు మంజూరైనా అది క్రిమినల్ కేసుగా పరిగణించలేమని, జరిమానాలు మాత్రమే విధించాలని వాదించారు. అయితే సీబీఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా, ఇండియా సిమెంట్స్ కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామన్నారు. కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకుని దాల్మియా పిటిషన్‌ను కొట్టి వేయొద్దని వాదించారు. దీనిపైన కూడా కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.
మరోవైపు, ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 ఆగస్టులో, జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, ట్రయల్ కోర్టులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనప్పటికీ సీబీఐ కోర్టులో ఇప్పటివరకూ విచారణ మొదలుకాలేదు. దీనిపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.
జగన్ అక్రమాస్తుల కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. వైసీపీ అనుకూల మీడియా ఈ కేసులను కక్షసాధింపుగా అభివర్ణిస్తుంది. అయితే టీడీపీ నాయకులు జగన్‌పై ఉచ్చు బిగుస్తోందని చెప్తున్నారు. ఇండియా సిమెంట్స్‌కు విముక్తి, దాల్మియా సిమెంట్స్ పిటిషన్‌తో ఈ కేసు బలహీనమవుతుందా లేక సీబీఐ, ఈడీ దర్యాప్తులు మరింత ఊపందుకుంటాయా అనేది రాబోయే విచారణలపై ఆధారపడి ఉంది. ఈ కేసు దీర్ఘకాలంగా సాగుతోంది. విచారణలు, వాయిదాలు, రాజకీయ ఒత్తిళ్లతో సంక్లిష్టంగా మారింది.













