వైసీపీ విశాఖ గర్జన.. టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర..! హోరెత్తిన నినాదాలు
విశాఖను రాజధానిని చేయాలంటూ ఉత్తరాంధ్ర జేఏసీ గర్జించింది. జోరువానలో కూడా వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. అందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. భారీవర్షంలో కూడా ర్యాలీ, బహిరంగసభ విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీ. ఇదే ఉత్సాహంతో విశాఖను రాజధాని చేసేంతవరకూ పోరాడాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఉత్తరాంద్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. అందుకే విశాఖ రాజధానిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీని వెలివేయాలని పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ టార్గెట్ గా మారింది.
విశాఖ వేదికగా టీడీపీపై వైసీపీ నేతలు విరుచుకు పడ్డారు. దీంతో టీడీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు గర్జన జరుగుతున్న సమయంలోనే టీడీపీ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. విశాఖను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల దోపిడీ నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర వనరులను దోచుకునేందుకు వైసీపీ నేతలు స్కెచ్ వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. లేకుంటే విశాఖ కూడా పులివెందుల లాగా మారిపోతుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కాదని.. కచ్చితంగా వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే విశాఖ ఎంతో అభివృద్ధి చెందిందని టీడీపీ నేతలు చెప్పారు. హైదరాబాద్ తర్వాత రెండో అభివృద్ధి చెందిన నగరంగా విశాఖ నిలిచిందన్నారు. ఇప్పుడు విశాఖను కొత్తగా వైసీపీ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడున్న అపార వనరులను దోచుకునేందుకే వైసీపీ నేతలు రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని హెచ్చరించారు. రుషికొండని దోచుకున్నారని.. రుషికొండ బీచ్ ను ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చేశారని చెప్పారు. ఇప్పటికే విశాఖలో 25వేల కోట్ల ఆస్తులు తాకట్టు పెట్టారని.. ఇలాంటి విషయాలు వైసీపీ నేతలు చెప్పరన్నారు. నాడు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందని వైసీపీ విమర్శిస్తోంది. అదే సమయంలో విశాఖను దోచుకునేందుకే వైసీపీ ఇక్కడ రాజధాని పేరుతో నాటకమాడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. రెండు పార్టీలూ ఉత్తరాంధ్ర కోసమే పోరాడుతున్నాయి. అయితే రెండు పార్టీల మార్గాలే వేరు. మరి ఈ రెండు పార్టీల్లో ఎవరిని ప్రజలు ఆదరిస్తారనేదానిపైనే ఆయా పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.













