మూకుమ్మడి రాజీనామాలపై వైసీపీ చేతులెత్తేసిందా..?
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే తాజా ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ విజయాన్ని చూసి భవిష్యత్తులో ఏ పార్టీకీ ఇన్ని సీట్లు రావనుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లను చూసి ఇంతకంటే దారుణమైన ఓటమి భవిష్యత్తులో ఇంకే పార్టీకి రాబోదని చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది వైసీపీకి. ఓడిపోయిన బాధలో ఉన్న ఆ పార్టీకి ఇప్పుడు నేతలు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తన నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.
మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు వైసీపీకి, పదవులకు రాజీనామాలు చేశారు. వాస్తవానికి వాళ్లకు ఇంకా పదవీకాలం ఉంది. వాళ్లు రాజీనామాలు చేయకపోతే వచ్చే నష్టమేం లేదు. రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరితే మళ్లీ పదవులు దక్కుతాయనే నమ్మకం కూడా లేదు. అయినా నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఇదే బాటలో మరికొంతమంది నేతలు కూడా రాజీనామాలు చేయబోతున్నట్టు వార్తలందుతున్నాయి. రాజ్యసభలో, శాసనమండలిలో ఇప్పటికే తమదే ఆధిపత్యం అని వైసీపీ చెప్పుకుంటూ వస్తోంది. ఇలా నేతలు రాజీనామాలు చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా ఆ పార్టీ బలం తగ్గిపోనుంది.
పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న నేతలే రాజీనామాలు చేసి వెళ్లిపోతుంటే పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. మోపిదేవి వెంకటరమణ లాంటి నేతలు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. ఆయనకు పార్టీ కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ వచ్చింది. అయినా ఆయన కూడా రాజీనామా చేసి తాను టీడీపీలో చేరబోతున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఆయనే వెళ్లిపోతుంటే ఇక మిగిలిన నేతలు ఎందుకుంటారనే ప్రశ్న పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. కాబట్టి త్వరలో భారీ ఎత్తున రాజీనామాలు ఉంటాయని వాళ్లకు కూడా అర్థమైంది.
అయితే వెళ్లే నేతలను బుజ్జగించాలా.. వద్దా అనే అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సహజంగా పార్టీ నుంచి నేతలెవరైనా వీడుతుంటే వెళ్లొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయట్లేదని సమాచారం. వెళ్లే వాళ్లు వెళ్లనివ్వండి.. మనం ఆపినంత మాత్రాన ఆగుతారా.. అని జగన్ సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. నేతలను చూసి మనం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని.. ప్రజలను చూసే మనం రాజకీయాలు చేయాలని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే బలమైన నేతల విషయంలో ఇలాంటి పంతాలకు పోతే మొదటికే మోసం వస్తుందని కొందరు నేతలు సలహా ఇస్తున్నారు. మొత్తానికి రాజీనామాల అంశంలో వైసీపీ అధిష్టానం చేతిలెత్తేసినట్టు కనిపిస్తోంది.













