టీడీపీ, జనసేన, బీజేపీ… కలిసే పోటీ ఛాన్స్ ఉందా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లూ సాధించాలనే టార్గెట్ తో ముందుకెళ్తోంది. మరోవైపు వైసీపీని ఈసారి ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక బీజేపీ – జనసేన కలసి పనిచేస్తూ… అడపాదడపా వైసీపీ పాలసీలను ఎండగడుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకూ ఈ మూడూ కలిసే అవకాశం ఉందా..?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బలంగా ఉంది. ఎన్నడూ లేనివిధంగా గత ఎన్నికల్లో ఆ పార్టీ 151 సీట్లను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ అన్ని సీట్లు రాలేదు. దీన్నిబట్టి వైసీపీ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చాక ఏ పార్టీకైనా బలం మరింత పెరగడం కామన్. మూడున్నరేళ్లుగా వైసీపీ అధికారంలో ఉంది. విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలతో పోల్చితే వైసీపీ దూకుడు ఎక్కువగా ఉంది. అధికారంలో ఉండడం, ప్రశాంత్ కిశోర్ డిజిటల్ మేనేజ్ మెంట్, పార్టీ కేడర్.. లాంటి అంశాలు వైసీపీకి ప్లస్. అందుకే ఈసారి ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ సీట్లనూ గెలవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కొద్దిగా కష్టపడితే అది సాధించడం పెద్ద కష్టమేం కాదనేది ఆయన ఆలోచన.
వైసీపీ సంగతి పక్కన పెడితే టీడీపీ ప్రతిపక్షంలో ఆపసోపాలు పడుతోంది. వైసీపీ దూకుడును ఎదుర్కొనేంత సత్తా ఇంకా ఆ పార్టీకి లేదనే చెప్పాలి. టీడీపీ నేతలపై కేసులు, అరెస్టులు, వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు.. లాంటి అనేక పరిణామాలు టీడీపీని కలవరపెడుతున్నాయి. అయినా వైసీపీని ఎదుర్కొనేందుకు శక్తిమేరా ప్రయత్నిస్తోంది టీడీపీ. అయితే వచ్చే ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం కంటే జనసేన, బీజేపీలతో కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవడం ఈజీ అనేది టీడీపీ ఆలోచన. అయితే టీడీపీతో జనసేన, బీజేపీ కలుస్తాయా.. లేదా అనేది ఇప్పుడే తెలిసే పరిస్థితి లేదు.
బీజేపీ విషయాన్ని కాసేపు అటుంచితే.. జనసేన మాత్రం టీడీపీతో కలిసేందుకు రెడీగా ఉంది. వైసీపీని గద్దె దించేందుకు ఎవరితోనైనా కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుతం జనసేన.. బీజేపీతో కలిసి పనిచేస్తోంది. మొదట్లో రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఆ రెండు పార్టీల ప్రయాణం కొనసాగుతోంది. అధికార వైసీపీతో బీజేపీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉందనే విషయం జనసేనాని పవన్ కల్యాణ్ కు అర్థమైంది. కాబట్టి బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లడం కష్టమేననేది ఆయన ఆలోచన. అందుకే వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీనే సేఫ్ అనే ఆలోచనలో జనసేన ఉన్నట్టు సమాచారం. పైగా ఏపీలో బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే. అలాంటప్పుడు ఆ పార్టీతో కలిసి వెళ్లకపోవడమే మంచిదని జనసేన శ్రేణులు పవన్ కల్యాణ్ కు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి.
ఇక బీజేపీ పరిస్థితి అటుఇటు కాకుండా ఉంది. ప్రస్తుతం వైసీపీతో బీజేపీ అధిష్టానానికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో రాష్ట్రంలో వైసీపీపై అగ్రెసివ్ గా ముందుకెళ్లే పరిస్థితి లేదు. అలాగని టీడీపీతో కలిసి పనిచేసేందుకు అటు కేంద్ర పెద్దలు కానీ, రాష్ట్ర పెద్దలు కానీ సుముఖంగా లేరు. గతంలో మోదీ, అమిత్ షాలపై చంద్రబాబు చేసిన కామెంట్స్ ను బీజేపీ నేతలు అంత ఈజీగా మర్చిపోయే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీతో కలిసేందుకు టీడీపీ ఉత్సాహం చూపిస్తున్నా.. బీజేపీ నుంచి మాత్రం అలాంటి సంకేతాలేవీ కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటే చేసే అవకాశం స్పష్టంగా ఉంది. బీజేపీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగనుంది.













