Pitapuram: పిఠాపురంలో పవన్ మార్క్ పాలిటిక్స్..! వర్మకు మిగిలింది కర్మే..!!
ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ (SVSN Varma).. ఈ పేరు చెప్తే ఎవరూ పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ పిఠాపురం వర్మ (Pitapuram Varma) అంటే మాత్రం అందరూ ఠక్కున గుర్తు పడతారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీటు త్యాగం చేసిన త్యాగమూర్తిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో (2024 Assembly Elections) టీడీపీ సీటు తనదేనని భావించి నామినేషన్ కు సిద్ధమవుతున్న సమయంలో పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఎంట్రీ ఇచ్చారు. తాను అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. దీంతో పిఠాపురం వర్మకు సీటు నిరాకరించి పవన్ గెలుపుకోసం పని చేయాలని చెప్పారు చంద్రబాబు (Chandrababu). ఆయన మాట ప్రకారం పవన్ గెలుపుకోసం అన్నీ తానై వ్యవహరించారు. గెలిపించారు.
కూటమి గెలిచిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు మాటిచ్చారు. తాజాగా ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కానీ ఆ కోటాలో వర్మకు సీటు దక్కలేదు. పైగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు (Nagababu) సీటిచ్చారు చంద్రబాబు. అంతేకాక నేడోరేపో నాగబాబు మంత్రివర్గంలో కూడా చేరబోతున్నారు. నాడు పవన్ కల్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మ.. ఇప్పుడు ఆయన సోదరుడు నాగబాబుకోసం ఎమ్మెల్సీని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొణిదెల సోదరులిద్దరూ పిఠాపురం తమదేనని చెప్పుకుంటున్నారు.
ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. పవన్ కల్యాణ్ గెలుపునకు నేనే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల ఖర్మ అన్నారు నాగబాబు. ఈ వ్యాఖ్యలు పిఠాపురం వర్మను ఉద్దేశించే అన్నారని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు పిఠాపురాన్ని నాగబాబు చేతుల్లో పెట్టారని.. ఇకపై అక్కడే తిష్టవేసి రాజకీయాలు చేయబోతున్నారని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే పిఠాపురంలో వర్మకు చెక్ పడినట్లే.
వర్మను ఎమ్మెల్సీ చేస్తే అక్కడ రెండు పవర్ సెంటర్స్ అవుతాయి కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా పవన్ కల్యాణ్ సోదరులు అడ్డకున్నారని టాక్ నడుస్తోంది. 2027 వరకూ ఎమ్మెల్సీ ఎన్నికలకు అవకాశం లేదు. అప్పటి వరకూ వర్మకు పదవి దక్కే ఛాన్సే లేదు. ఈలోపు సోదరులిద్దరూ పిఠాపురంలో చక్రం తిప్పే అవకాశం ఉంది. పైగా వాళ్లు పవర్ లో ఉంటారు కాబట్టి అధికారయంత్రాంగం అంతా వాళ్ల మాటే ఉంటుంది. వాళ్లకు పదవులు వచ్చేందుకు త్యాగాలు చేసిన వర్మ మాత్రం ఇప్పుడు ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి పిఠాపురంలో పవన్ బ్రదర్స్ తమదైన రాజకీయాలతో వర్మకు అడ్డుకట్ట వేశారని స్థానికులు భావిస్తున్నారు.













