ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక పవన్ కల్యాణ్ కన్ఫ్యూజన్..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించుతామని చెప్తున్నారు. వైసీపీ ఈసారి 175 స్థానాల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. అధికారంలో ఉన్న అలాంటి పార్టీలో ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ కొండను ఢీకొట్టేందుకైనా సిద్ధపడే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌ది. తాను అనుకున్నది చేస్తారంతే.. వెనుకా ముందూ చూసుకోరు. ఇప్పుడు కూడా అదే దూకుడుతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. అయితే తాను మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇవ్వట్లేదు. ఇదే ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. గతంలో లాగా ఓడిపోకుండా గెలవాలంటే ఏం చేయాలి.. లాంటి అనేక అంశాలు ఇప్పుడు జనసైనికులకు పెద్ద సవాల్ గా మారాయి.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే అదృష్టం కలిసి రాలేదు. రెండు చోట్లా ఓడిపోయారు. తన పార్టీ అభ్యర్థి రాపాక వర ప్రసాద్ రావు మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా అధికారపక్షం చెంతన చేరారు. దీంతో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయినట్లయింది. అందుకే ఈసారి ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలిచి అధికారంలో భాగం కావాలనుకుంటున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం టీడీపీతో కలిసి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు పార్టీల నుంచి ఇలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి కూడా.
అయితే పవన్ కల్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక, భీమవరంల నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయవచ్చని జనసేన శ్రేణులు అంచనా వేస్తున్నాయి. తొలిసారే ఓటమి రుచి చూపించిన నియోజకవర్గాలు కాకుండా కొత్త స్థానం అయితే బెటర్ అని పవన్ కల్యాణ్ కు పలువురు సూచించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే తిరుపతిని సేఫ్ ప్లేస్ గా అభివర్ణిస్తున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సొంతూరు మొగల్తూరు ఉన్న నర్సాపురంలో మెగాస్టార్ ను ఓడించారు జనం. అయితే తిరుపతిలో మాత్రం చిరంజీవిని గెలిపించారు. మెగా ఫ్యామిలీకి తిరుపతిలో అభిమానగణం బాగా ఉంది. అందుకే గతంలో అన్న గెలిచిన తిరుపతి నుంచే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే మరికొంతమంది కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కురసాల కన్నబాబు ఇక్కడ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన కురసాల కన్నబాబు ఆ తర్వాత ఇండిపెండెంట్ గా, తర్వాత వైసీపీలో చేరి పోటీ చేశారు. 3 సార్లలో 2 సార్లు విజయం సాధించారు. మంత్రి కూడా అయ్యారు.
పవన్ కల్యాణ్ ముందు ఇప్పుడు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరం.. కొత్తగా తిరుపతి, కాకినాడ రూరల్..! అయితే ఓడించిన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయకపోవచ్చనే తెలుస్తోంది. తిరుపతి, కాకినాడ రూరల్ లలో ఏదో ఒక సీటు నుంచి బరిలోకి దిగొచ్చని సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై ఇప్పటికీ పవన్ కల్యాణ్ కు క్లారిటీ రాలేదు. చివరి నిమిషం వరకూ వేచి చూసి.. చివర్లో ఏదో ఒక సీటు నుంచి బరిలోకి దిగితే గతంలో లాగే ఓడిపోక తప్పదు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో డిసైడ్ చేసుకుని.. అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అభిమానులను, కుల ప్రజలను నమ్ముకుని బరిలోకి దిగి బోల్తా పడిన వారెందరో ఉన్నారు. అందుకే ప్రజల్లో నిత్యం తిరుగుతూ.. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. జగన్, చంద్రబాబులను పులివెందుల, కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారంటూ అందుకు వాళ్లు అక్కడ చేసిన గ్రౌండ్ వర్క్ చాలా ముఖ్యం. ఇప్పటికీ వాళ్లు ఆ నియోజకవర్గాలను అక్కున చేర్చుకుంటూ ఉంటారు. అక్కడి ప్రజలకోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. అందుకే వాళ్లు అక్కడ ప్రచారం చేయకపోయినా ప్రజలు వాళ్లకు పట్టం కడుతుంటారు. అది నియోజకవర్గ ప్రజలు వారిపైన పెట్టుకున్న నమ్మకం. అలా నియోజకవర్గాన్ని ఎంచుకుని, అక్కడ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోకుండా గాలివాటంగా పోటీ చేస్తే ఈసారి కూడా బోల్తా పడక తప్పదు. అందుకే ఇప్పటికైనా పవన్ కల్యాణ్ క్లారిటీ తెచ్చుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటే బెటర్.













