Nagababu: నాగబాబుకు మంత్రి పదవి లేనట్టే..!! పవన్ కల్యాణ్ యూటర్న్..!?
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబును (Nagababu) మంత్రివర్గంలోకి తీసుకోవాలని గతంలోనే నిర్ణయించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో నాగబాబును మండలికి పంపించి మంత్రిపదవి (Minister) కట్టబెట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. నాగబాబు ఎమ్మెల్సీ కావడం, ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టడం ఖాయమనుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా ఏదైనా కార్పొరేషన్ కు చైర్మన్ (Corporation Chairman) ను చేయాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే పవన్ కల్యాణ్ కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు (Chandrababu). ఆయన అడిగినవన్నీ చేసి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించినప్పటి నుంచి తన వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాగబాబును మొదట ఎంపీగా బరిలోకి దింపాలనుకున్నారు. అనకాపల్లి (Anakapalli) స్థానం నుంచి నాగబాబు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. చివరి నిమిషంలో ఆ స్థానాన్ని బీజేపీ (BJP) సీఎం రమేశ్ (CM Ramesh) కు కేటాయించడంతో నాగబాబు బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని భావించారు.
వైసీపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక దాన్ని జనసేనకు కేటాయించి నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ఊహించారు. అయితే వాటిలో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. దీంతో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ సమయంలో నాగబాబును త్వరలోనే ఎమ్మెల్సీని చేసి కేబినెట్ లోకి తీసుకుంటామని చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని స్థానాలనూ కూటమి అభ్యర్థులే గెలుచుకుంటారు. దీంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఖాయమనుకున్నారు. తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారని భావించారు.
అయితే రెండ్రోజుల కిందట చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పలు అంశాలపై సమాలోచనలు జరిపారు. ఇందులో నాగబాబుకు మంత్రి పదవి కాకుండా ఏదైనా కీలక కార్పొరేషన్ కు ఛైర్మన్ పదవి అప్పగించాలని పవన్ కల్యాణ్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లో ముగ్గురు జనసేన మంత్రులున్నారు. అందులో ఇద్దరు కాపులు. ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే మరో కాపు వ్యక్తికి ఇచ్చినట్లవుతుంది. పైగా సోదరుడిని కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ పలు విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలని పవన్ కల్యాణ్ భావించినట్లు సమాచారం. అందుకే నాగబాబును కార్పొరేషన్ ఛైర్మన్ ను చేయబోతున్నారు.













