వర్కవుట్ అయిన జగన్ క్లాస్..! మంత్రులందరూ ఫుల్ యాక్టివ్..!!
కొన్నిరోజుల కిందట ఏపీ సీఎం జగన్.. తన కేబినెట్ సహచరులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినా మంత్రులు పెద్దగా పట్టించుకోలేదు. చోటామోటా లీడర్లు మాత్రమే ప్రతిపక్ష నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. మంత్రులందరూ కిమ్మనకపోవడం సీఎం జగన్ కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం తెప్పించింది. వెంటనే మరుసటి కేబినెట్ సమావేశంలో జగన్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. తన కుటుంబసభ్యులపైనే ఆరోపణలు వచ్చినా పట్టించుకోరా.. ఇలాగేతే పీకి పడేస్తా.. మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయమంటారా.. అని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
జగన్ వార్నింగ్ బాగా వర్కవుట్ అయినట్లుంది. కేబినెట్ మీటింగ్ అయిన రోజు నుంచే మంత్రులందరూ ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ప్రతిపక్షాల నుంచి ఏ చిన్న విమర్శ వచ్చినా ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ము దులిపేస్తున్నారు. అసెంబ్లీలో, బయటా టీడీపీ నేతలపై భగ్గుమంటున్నారు. ఇక జగన్ కుప్పం టూర్ నేపథ్యంలో మంత్రులందరిలో జోష్ కనిపించింది. కుప్పంను కూడా గెలవబోతున్నామంటూ ట్వీట్లు, స్టేట్ మెంట్లతో హోరెత్తించారు.
ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఏపీలో తీవ్ర రచ్చ రాజేస్తోంది. పేరు మార్పుపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ నేతలు రోజూ ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ – వైఎస్ఆర్ ఒక్కటి కాదని చెప్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. వై.ఎస్.ఆర్ కంటే ఎన్టీఆర్ ఏమంత గొప్ప కాదంటున్నారు. ఎన్టీఆర్ పైన టీడీపీ నేతలు, ఆయన కుటుంబసభ్యుల కంటే జగన్ కే ఎక్కువ ప్రేమ ఉందంటున్నారు. అందుకే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామంటున్నారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదంలో బాలయ్య చేసిన ట్వీట్ తీవ్ర దుమారానికి కారణమైంది. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన చేసిన ట్వీట్ వైసీపీ శ్రేణులకు తీవ్ర అగ్రహం తెప్పించింది. శునకానందం పొందుతున్నారంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతల్లో మంట పుట్టించింది. ముఖ్యంగా మంత్రులు బాలయ్య కామెంట్స్ ను చూసి తట్టుకోలేకపోతున్నారు. మంత్రి జోగి రమేశ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బాలయ్యను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. శుంఠ అని, దద్దమ్మ అని.. కుక్క అని.. తీవ్రంగా దునుమాడారు.
ఇక మిగిలిన మంత్రులు కూడా బాలయ్యపై ట్వీట్లతో విరుచుకుపడ్తున్నారు. అంబటి రాంబాబు, రోజా, విడదల రజని, సీదిరి అప్పల్రాజు, గుడివాడ అమర్నాథ్, అంజాద్ భాషా.. ఇలా అమాత్యులందరూ దుమ్ము దులిపేశారు. మంత్రుల యాక్టివ్ నెస్ చూసి జగన్ క్లాస్ బాగా వర్కవుట్ అయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ పెద్దగా జనం ముందుకు రాని, ట్వీట్లు చేయని మంత్రులు కూడా ఇప్పుడు యాక్టివ్ కావడం అటు వైసీపీ నేతల్లో కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.. మార్పు మంచిదే!













