మాటల మంటలు..! బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేశ్..!!
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రచ్చ రాజేస్తూనే ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అధికారంలోకి రాగానే పేరు మార్చి తీరుతామని.. బదులు తీర్చుకుంటామని టీడీపీ చెప్తుంటే.. వైసీపీ మాత్రం చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఎన్టీఆర్ కుమారుడు, చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. పంచభూతాలు ఉన్నాయంటూ ఆయన చేసిన కామెంట్ అగ్గి రాజేసింది. బాలకృష్ణ ట్వీట్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కాస్త ఆలస్యంగా స్పందించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికీ NTR అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..! తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..” అని ట్వీట్ చేశారు బాలకృష్ణ.
బాలకృష్ణ ట్వీట్ ఉదయం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం కలిగించింది. బాలకృష్ణ ఇంత ఘాటుగా స్పందించాడేంటి.. అని అందరూ అనుకున్నారు. నందమూరి ఫ్యామిలీలో మిగిలిన వాళ్లు మామూలుగా రియాక్ట్ అయితే.. బాలయ్య మాత్రం లేటుగా అయినా ఘాటుగా స్పందించాడని అందరూ అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గోడమీద పిల్లిలాగా.. దగ్గుబాటి పురందేశ్వరి చాలా సింపుల్ గా రియాక్ట్ అయ్యారని సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బాలకృష్ణ ట్వీట్ చూసిన తర్వాత సింహం గర్జించిందంటూ సంబరపడ్డారు..
అయితే బాలకృష్ణ ట్వీట్ పై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మంత్రి జోగి రమేశ్ బాలయ్య ట్వీట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కుమారులు పరమ శుంఠలు అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ పార్టీని లాక్కొని సీఎం సీటులో కూర్చోవడానికి నువ్వేం చేశావని ప్రశ్నించారు జోగి రమేశ్. జాతికి, సమాజానికి ఎన్టీఆర్ ను దూరం చేసింది మీరేనన్నారు. చంద్రబాబు శునకం అయితే దాని తోక బాలకృష్ణ అని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. కుటుంబ విలువలను తుంగలో తొక్కి ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న చంద్రబాబు వెంట నడిచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు మంత్రి. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని తండ్రి కోరినా.. ఆయన కోరిక తీర్చని దద్దమ్మలు మీరు అని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. బాలకృష్ణ మాటలు వింటే కుక్కలు కూడా చిన్నబుచ్చుకుంటాయన్నారు. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన చంద్రబాబు కొడుక్కు పిల్లనిచ్చిన నిన్ను ఏమనాలని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా కృష్ణా జిల్లాకు సీఎం జగన్ పేరు పెట్టారన్నారు మంత్రి జోగి రమేశ్. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ బాలకృష్ణకు జన్మనిస్తే.. వైఎస్. రాజశేఖర రెడ్డి పునర్జన్మనిచ్చారన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై నాలుగు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నా.. అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదన్నారు జోగి రమేశ్. నువ్ ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుడితే.. రోషం ఉంటే.. ఆయన చావుకు కారణమైన చంద్రబాబును కొట్టాలని సూచించారు.
మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం సబబు కాదన్న జగన్ సోదరి షర్మిల కామెంట్స్ పైన కూడా మంత్రి జోగి రమేశ్ స్పందించారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను షర్మిల విని ఉండరని.. అందుకే అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.













