శైలజానాథ్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ … టీడీపీలో చేరిక ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ తో టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భేటీ కావడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శైలజానాథ్ ఏపీ పీసీసీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండట్లేదు. పైగా ఆయన టీడీపీ గూటికి చేరబోతున్నారనే వార్తలు కొంతకాలంగా జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జేసీ దివాకర్ రెడ్డి.. శైలజానాథ్ తో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లిద్దరి భేటీతో శైలజానాథ్ టీడీపీ గూటికి చేరడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి సాకే శైలజానాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఏపీ పీసీసీ పగ్గాలు కూడా చేపట్టారు. గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో శైలజానాథ్ ఒకరు. అయితే రాష్ట్ర విభజన చాలా మంది కాంగ్రెస్ నేతలకు రాజకీయ ఉనికి లేకుండా చేసింది. చాలా మంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొందరు పార్టీలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయిన వాళ్లలో శైలజానాథ్ ఒకరు. అయితే ఏపీలో ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమే. అందుకే మిగిలన కొంతమంది నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన బీజేపీలోకి వెళ్లడంతో శైలజానాథ్ లాంటి నేతలు కూడా కమలం గూటికి వెళ్తారేమో అని ఊహాగానాలు వినిపించాయి. కిరణ్ కుమార్ రెడ్డి కూడా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ లోకి తీసుకొస్తానని అధిష్టానానికి మాటిచ్చినట్టు తెలుస్తోంది. అయితే శైలజానాథ్ మాత్రం టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంతో బీజేపీ కూడా అంతే. అందుకే దాని బదులు ఏదైనా ప్రధాన పార్టీలోకి వెళ్తే పదవి దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకే శైలజానాథ్ టీడీపీలోకి వెళ్లేందుకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
శింగనమల ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు శైలజానాథ్. అయితే ఇప్పటికే టీడీపీలో ఆ సీటు కోసం పోటీ బలంగా ఉంది. అందుకే ముందే సీటు కన్ఫామ్ చేసుకుని పార్టీలో చేరాలనుకుంటున్నారాయన. అందులో భాగంగానే జేసీ దివాకర్ రెడ్డితో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. జేసీ దివాకర్ రెడ్డి ద్వారా సీట్ కన్ఫామ్ చేయించుకుని త్వరలోనే టీడీపీ గూటికి చేరేందుకు శైలజానాథ్ ప్రయత్నిస్తున్నారు.













