Jangareddygudam: మళ్లీ తెరపైకి జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలు.. విచారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్..!!

ఏలూరు (Elur) జిల్లా జంగారెడ్డిగూడెంలో (Jangareddy Gudam) 2022 మార్చిలో జరిగిన మరణాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. నాటి వైసీపీ (YCP) ప్రభుత్వం నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్లే ఈ మరణాలు సంభవించాయన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి జగన్ (Jagan) ప్రభుత్వం ఈ మరణాలను తేలికగా కొట్టిపారేసింది. ఇవి కరోనా అనంతర సహజ మరణాలేనని సాక్షాత్తూ అసెంబ్లీలో సీఎంగా జగన్ ప్రకటించారు. అయితే పోస్ట్ మార్టం (Postmortum) రిపోర్ట్ ను బయటపెట్టలేదు. మూడేళ్లు గడిచినా ఈ రిపోర్ట్ బయటపడకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force) ను ఏర్పాటు చేయడంతో, పోస్ట్ మార్టం నివేదిక వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
2022 మార్చిలో జంగారెడ్డిగూడెంలో సుమారు 20 మంది మరణించిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మద్యం తాగిన తర్వాత కొందరు అస్వస్థతకు గురై మరణించారని, ఇందుకు కల్తీ మద్యమే కారణమని అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ (TDP) తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ మరణాలను సహజ మరణాలుగా, పోస్ట్ కోవిడ్ పరిణామాల వల్ల సంభవించినవిగా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కల్తీ మద్యం ఆరోపణలను తోసిపుచ్చారు.
టీడీపీ మాత్రం ఈ మరణాలను జే బ్రాండ్ మరణాలుగా అభివర్ణించింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించింది. అసెంబ్లీలో ఈ అంశంపై తీవ్ర వాదప్రతివాదాలు జరిగాయి. టీడీపీ నేతలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం దానిని విడుదల చేయకపోవడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రిపోర్ట్ లో మరణాలకు ఖచ్చితమైన కారణాలు, మద్యంలో విషపూరిత పదార్థాల ఉనికి వంటి కీలక వివరాలు ఉంటాయని భావించారు. అయితే ఆ రిపోర్ట్ బయటకు రాకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ జంగారెడ్డిగూడెం మరణాలకు అసలు కారణాలను కనుగొనడంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ రిపోర్ట్ దర్యాప్తులో కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఇందులో మరణాలకు కారణమైన ఖచ్చితమైన విషయాలు, మద్యం నాణ్యతకు సంబంధించిన సాంకేతిక వివరాలు ఉండవచ్చు.
వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ మరణాలు అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల వల్ల సంభవించాయని, కల్తీ మద్యం ఆరోపణలు ఎల్లో మీడియా దుష్ప్రచారమని వాదిస్తోంది. 2022లో అధికారులు ఇచ్చిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారని, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఘటనను రాజకీయంగా వక్రీకరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు ఫలితాలు, ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలా, లేక సహజ కారణాల వల్ల సంభవించినవా అన్న ప్రశ్నకు సమాధానం దొరకనుంది. ఈ దర్యాప్తు ఫలితాలు రాష్ట్రంలో మద్యం విధానం, పరిపాలనా వైఫల్యాలపై కూడా కొత్త చర్చకు దారితీయవచ్చు. మొత్తంగా జంగారెడ్డిగూడెం మరణాల ఘటన అప్పటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం, పారదర్శకత లోపాలను ఎత్తిచూపింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు ఈ రహస్యాన్ని ఛేదించి, నిజాలను బయటపెట్టడంతో పాటు, బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.