IPS Vs NDA: వైసీపీకి సస్పెండెడ్ ఐపీఎస్ అండ..!? కూటమికి సవాల్..!!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది. అక్రమ గనులు, భూ కబ్జాలు, ఆర్థిక అవకతవకలు వంటి అనేక ఆరోపణలపై వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు అనేక వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో, సస్పెన్షన్లో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి (IPS) వీరికి అన్ని విధాలా సహకరిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సదరు ఐపీఎస్ అధికారి, గత వైసీపీ ప్రభుత్వ (YCP Govt) హయాంలో కీలక పదవులు నిర్వహించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్లో (suspension) ఉన్నప్పటికీ, ఆయన పోలీస్ శాఖలోని (police dept) తన సన్నిహితుల ద్వారా విచారణలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సేకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని వైసీపీ నేతలకు చేరవేస్తూ, విచారణలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు లేదా అధికారులు అడిగే ప్రశ్నలకు తప్పుదోవ పట్టించేలా సమాధానాలు ఇచ్చేందుకు మార్గదర్శనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలు కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారాయి. ఎందుకంటే ఈ అధికారి ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నందున, ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోవడం సంక్లిష్టంగా మారింది.
కూటమి ప్రభుత్వం ఈ ఐపీఎస్ అధికారి చర్యలను అత్యంత సీరియస్గా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఈ ఐపీఎస్ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలా కంట్రోల్ చేయాలి.. అనే అంశంపై ప్రభుత్వ పెద్దలు లోతైన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ అధికారికి పోలీస్ శాఖలో గట్టి ఉంది. ఆయనపై మరిన్ని చర్యలు తీసుకుంటే శాఖలో అసంతృప్తి లేదా వ్యతిరేకత రావచ్చనే ఆందోళన ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తూ, చట్టపరమైన ఆధారాలతోనే ఈ ఐపీఎస్ కు ముకుతాడు వేయాలని భావిస్తోంది.
వైసీపీ నేతలపై నమోదైన కేసుల్లో అక్రమ గనులు, ఆర్థిక అవకతవకలు, భూ కబ్జాలు ప్రధానమైనవి. ఈ కేసుల్లో విచారణలు తీవ్రతరం కావడంతో కొందరు నేతలు అంతర్గత సమాచారం ఆధారంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి వాస్తవానికి విజయవాడ దాటి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఈయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడుపుతున్నారని కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ఈ ఐపీఎస్ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది.













