GV Reddy: పార్టీకి మాత్రమే రాజీనామా.. మనసంతా పార్టీతోనే..!!
జీవి రెడ్డి (GV Reddy) ఇటీవల బాగా వార్తల్లో ఉన్న వ్యక్తి. వెంకట్ రెడ్డిగా (G Venkat Reddy) ఈయన సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీలో (congress Party) రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన.. ఎన్నికల ముందు టీడీపీలో (TDP) చేరారు. ఆయనకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది టీడీపీ. కూటమి అధికారంలోకి రాగానే జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ (Fibre net corporation) ఛైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు. అనతికాలంలోనే అందులో జరిగిన అవినీతి, అక్రమాలపై యుద్ధం ప్రకటించారాయన. తన మాట వినకపోవడంతో ఏకంగా ఉన్నతాధికారులపైనే పోరుకు నడుం బిగించారు. అయితే అన్నీ ఆయన అనుకున్నట్టు సాగలేదు. దీంతో టీడీపీ, పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఫైబర్ నెట్ లో అవినీతికి పాల్పడుతూ ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీంతో ఆయనపై ఐఏఎస్ (IAS) అధికారులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. జీవీ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మందలించారు. దీన్ని అవమానంగా భావించిన జీవీ రెడ్డి.. పార్టీకి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా (GV Reddy Resign) చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. కేడర్ మొత్తం జీవీ రెడ్డికి అండగా నిలిచింది. పార్టీ హైకమాండ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని నుంచి బయట పడేందుకు పార్టీ హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
జీవీ రెడ్డిని బద్నాం చేసేందుకు టీడీపీలోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఆయనుకు మద్దతు వెల్లువెత్తుతుండడంతో దానినుంచి బయటపడేందుకు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది. అయినా వాళ్ల ప్లాన్లు వర్కవుట్ కాలేదు. పైగా జీవీ రెడ్డికి మద్దతు మరింత ఎక్కువైంది. ఆయన్ను పార్టీ మళ్లీ చేర్చుకోవాలని, ఆయన్ను పిలిచి మాట్లాడలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. పార్టీ హైకమాండ్ కూడా జీవీ రెడ్డి విషయంలో తప్పు జరిగిందని భావిస్తోందని, త్వరలోనే ఆయన పార్టీలోకి వస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈసారి మరింత ఉన్నతమైన పదవిని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు.
అయితే ఈ ప్రచారానికి జీవీ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశారు. అయితే తాను రాజకీయాల్లో లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వం పట్ల గౌరవం, అభిమానం ఎప్పటికీ ఉంటాయని వెల్లడించారు. తక్కువ కాలంలోనే టీడీపీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇచ్చిన చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఏపీ అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. దీంతో జీవి రెడ్డి పార్టీకి రాజీనామా చేసినా మనసంతా ఇప్పటికీ టీడీపీతోనే ఉందని భావిస్తున్నారు.













