ఈసారి కూడా కుప్పంలో చంద్రబాబుకు చుక్కలేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనల్లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు సభల్లో తొక్కిసలాటల వల్ల కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలపై అప్రమత్తమైన ప్రభుత్వం రోడ్లు, ఇరుకైన సందుల్లో సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. వీటికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ పాదయాత్రలను అడ్డుకునేందుకే ఇలాంటి అడ్డగోలు నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలో కూడా నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో మరోసారి వైసీపీ – టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజులపాటు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు అక్కడే మకాం వేయనున్న చంద్రబాబు రోడ్డు షోలతో పాటు బహిరంగసభలు నిర్వహించాలని భావించారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే చంద్రబాబు పర్యటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు సభలను ఎక్కడెక్క నిర్వహిస్తున్నారో వెల్లడించాలని ఆయన పర్సనల్ సెక్రటరీకి పోలీసులు నోటీసులు అందించారు. పలమనేరు డీఎస్పీ ఈ నోటీసులను జారీ చేశారు. ఇరుకు సందులతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారులపై సభలు నిర్వహించేందుకు అనుమతి లేదని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. పైగా రోడ్డు షోలు, సభలు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారో ముందుగా సమాచారం ఇవ్వాలని.. వాటికి అనుమతి ఇస్తేనే సభలు, కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అందులో పేర్కొన్నారు.
పోలీసులు ఇచ్చిన నోటీసులపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆంక్షలు విధించి చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. నోటీసులపై పోలీసులతో సమావేశమయ్యారు. తాము ఎక్కడెక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తామో పోలీసులకు వివరించారు. అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అనుమతి ఉంటేనే సభలు, రోడ్డు షోలు నిర్వహించుకోవాలని నోటీసుల్లో పేర్కొనడంతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. అడ్డగోలు నిబంధనలతో తమ అధినేత పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇలాంటి వాటిని ఖాతరు చేయబోమని టీడీపీ నేతలు చెప్తున్నారు. చంద్రబాబు పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ఓర్చుకోలేకే ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చిందని విమర్సిస్తున్నారు.
గతంలో చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రోడ్డైపు బైఠాయించి నిరసన తెలిపారు. కుప్పంపై వైసీపీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టడం.. ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తుండడంతో టీడీపీ అప్రమత్తమైంది. గతంలో చంద్రబాబు ఎప్పుడూ కుప్పంపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. టీడీపీ నేతలే చంద్రబాబు తరపున అన్నింటినీ చక్కబెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. దీంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే పరిస్థితులు చేజారిపోతాయేమోనని భావించిన చంద్రబాబు 3 నెలలకోసారి అక్కడ పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. గత పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఈసారి మరింత అప్రమత్తమయ్యారు. అయితే ఇటీవల తొక్కిసలాటల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించడంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య మరో వివాదం తలెత్తుతోంది.













